Cricket: వివాదం తర్వాత తొలిసారి ఇంటి నుంచి బయటకొచ్చిన హార్దిక్ పాండ్యా.. ఎయిర్ పోర్టుకు ప్రయాణం!
- సోషల్ మీడియాలో ఫొటోలు హల్ చల్
- అంబుడ్స్ మన్ నియామకానికి సుప్రీం నో
- పాండ్యా, రాహుల్ కెరీర్ పై నీలినీడలు
‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరిని బీసీసీఐ భారత జట్టు నుంచి తప్పించింది. అర్థాంతరంగా ఆస్ట్రేలియా నుంచి ఇండియా విమానం ఎక్కించి వెనక్కు పంపించింది.
అంతేకాకుండా నెటిజన్లు కూడా వీరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోయిన హార్దిక్ ఇంటి నుంచి బయటకు రావడమే మానుకున్నాడు. తాజాగా హార్దిక్ ముంబై ఎయిర్ పోర్టులో కనిపించాడు. సోదరుడు కృనాల్ పాండ్యాతో కలిసి ఎయిర్ పోర్ట్ లోకి హార్దిక్ వెళుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.
బీసీసీఐ నిషేధం నేపథ్యంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ తో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్ కు దూరమయ్యారు. అంతేకాకుండా మళ్లీ క్రికెట్ మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతారో తెలియని పరిస్థితి నెలకొంది. బీసీసీఐ నియమావళి ప్రకారం ఆటగాళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే తుది అధికారం బోర్డు నియమించిన అంబుడ్స్‌మన్‌కే ఉంటుంది. ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్‌మన్‌కే ఇవ్వాలి.
అయితే ఈ అంబుడ్స్ మన్ ను ఇప్పటికిప్పుడు నియమించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంబుడ్స్‌మన్‌ను నియమించే అధికారం కేవలం బోర్డుకే ఉందనీ, అదీ ఎన్నికలు నిర్వహించి కార్యవర్గం ఏర్పడిన తర్వాత మాత్రమే సాధ్యమని తేల్చిచెప్పింది. దీంతో పాండ్యా, రాహుల్ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.