Cricket: భారత ఆటగాళ్లకు 500 డాలర్ల ప్రైజ్ మనీ.. ఆస్ట్రేలియాపై తీవ్రంగా మండిపడ్డ సునీల్ గవాస్కర్!
- వన్డే సిరీస్ ను దక్కించుకున్న భారత్
- ధోనీ, చాహల్ కు 500 డాలర్ల చొప్పున ఇచ్చిన నిర్వాహకులు
- దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ 2-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్-ఆస్ట్రేలియాల మధ్య నువ్వా? నేనా? అన్నట్లు సాగిన ఈ సిరీస్ లో చివరి నిర్ణయాత్మక మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిశాక టోర్నీ నిర్వాహకులు, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఇచ్చిన నగదు బహుమతిపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పాన్సర్లతో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న నిర్వాహకులు.. కేవలం 500 డాలర్లు (రూ.35,000) ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
సిరీస్ ముగిశాక లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించగా, ధోనీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బహుమతి దక్కింది. ఈ సందర్భంగా నిర్వాహకులు, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఎ) వీరిద్దరికీ చెరో 500 డాలర్ల చెక్కును అందించడాన్ని సునీల్ గవాస్కర్ తప్పుపట్టారు. ‘మరీ కనికరం లేకుండా.. ఈ 500 యూఎస్ డాలర్లు ఇవ్వడం ఏంటి? సిరీస్ గెలిస్తే భారత జట్టుకు కేవలం ట్రోఫీ మాత్రమే దక్కింది. టోర్నీ నిర్వాహకులు ప్రైజ్‌మనీ కూడా ఇవ్వలేకపోయారు.
బ్రాడ్‌కాస్ట్ హక్కుల పేరిట చాలా సొమ్ముచేసుకున్నారు. అయినా ఆటగాళ్లకు మంచి నగదు బహుమతి ఎందుకు ఇవ్వలేదు? ఆటగాళ్ల వల్లనే స్పాన్సర్లు వస్తారు. వారి వల్లనే డబ్బులు వస్తాయి. ఒక్కసారి వింబుల్డన్‌లో ఆటగాళ్లకు ఇచ్చే నగదు బహుమతిని చూడండి. ఆటగాళ్ల వల్లనే క్రీడల్లో కాసుల వర్షం కురుస్తుంది. వారికి గౌరవప్రదమైన క్యాష్ రివార్డ్స్ ఇవ్వండి’ అని గవాస్కర్ చురకలంటించారు. కాగా, నిర్వాహకులు భారత ఆటగాళ్లను అవమానించారనీ, వెంటనే క్షమాపణ చెప్పాలని అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు.