Kerala: శబరిమలలో మళ్లీ టెన్షన్.. ఇద్దరు మహిళలను అడ్డుకున్న ఆందోళనకారులు!
- ఈరోజు అయ్యప్ప దర్శనానికి చేరుకున్న మహిళలు
- ముందుకు వెళ్లకుండా ఆందోళనకారుల అడ్డంకి
- పోలీసుల సూచనతో వెనక్కు మళ్లిన మహిళలు
కేరళలోని శబరిమల ఆలయం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలను వెళ్లకుండా చాలామంది ఆందోళనకు దిగారు. తాజాగా ఈరోజు ఉదయం 50 ఏళ్లలోపు ఉన్న ఇద్దరు మహిళలు ఆలయానికి వెళ్లేందుకు యత్నించగా ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో ముందుకు వెళ్లే దారిలేకపోవడంతో పోలీసుల సూచన మేరకు వీరు నీలక్కల్ బేస్ నుంచి వెనుదిరిగారు. మరోవైపు అయ్యప్పస్వామిని దర్శించుకున్న కాలేజీ లెక్చరర్ బిందు, ప్రభుత్వ ఉద్యోగి కనకదుర్గలకు గట్టి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేరళ ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. బిందుకు నలుగురు పోలీసులు, కనకదుర్గకు 19 మంది సిబ్బందితో గట్టి భద్రత కల్పించామని కోర్టుకు తెలిపారు.