BJP: ఔరంగజేబుతో మొఘలు సామ్రాజ్యం పతనం... రాహుల్‌తో కాంగ్రెస్ ఖతం: బీజేపీ నేత జ్ఞాన్‌దేవ్ ఆహుజా
- ఇక కాంగ్రెస్ శకం ముగిసినట్లేనని వివాదాస్పద వ్యాఖ్యలు
- రాజస్థాన్‌లో ఉప ఎన్నిక సందర్భంగా మాటల దుమారం
- ఈనెల 28న రామ్ గఢ్ ఉప ఎన్నిక
ఔరంగజేబు అధికారంలోకి వచ్చాక మొఘలు సామ్రాజ్యం పతనం ప్రారంభమయ్యిందని, రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదేనని రాజస్థాన్ బీజేపీ ఉపాధ్యక్షుడు జ్ఞాన్‌దేవ్ ఆహుజా వ్యాఖ్యానించారు. ఔరంగజేబు మాదిరిగానే కాంగ్రెస్‌కు చివరి చక్రవర్తి రాహుల్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా జ్ఞాన్‌దేవ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగింది. గోవుల స్మగ్లర్లను ఉగ్రవాదులతో పోల్చుతూ ఆహుజా గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఆహుజా రామ్‌గఢ్ నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థి హఠాన్మరణం చెందడంతో ఎన్నిక వాయిదా పడింది. ఈనెల 28వ తేదీన ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి.