beloon festival: ఆకాశ వీధి నుంచి అరకు అందాల వీక్షణం.. అరకులో నేటి నుంచి బెలూన్ ఫెస్టివల్!
- మూడు రోజులపాటు ఉచిత ఆకాశయానం
- బెలూన్లలో విహారం పూర్తిగా ఉచితం
- ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
విశాఖ జిల్లాను పర్యాటక స్వర్గధామంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఆంధ్ర కశ్మీర్‌గా పేరొందిన అరకు ఏజెన్సీలో మూడు రోజులపాటు బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఏజెన్సీ అందాలను ఆకాశం నుంచి చూసే అద్భుత అవకాశం సందర్శకులకు కల్పిస్తోంది. ఇందుకోసం అరకు మండలం భల్లు గుడ, దళపతి గుడ సమీపంలో అవసరమైన ఏర్పాట్లు చేసింది.
ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు అంతర్జాతీయంగా పేరొందిన 15 దేశాలకు చెందిన పైలట్లు (బెలూన్లు నడిపేవారు) 20 బెలూన్లతో ఇప్పటికే అరకు చేరుకున్నారు. వీరితోపాటు అతిథుల మర్యాద కోసం తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. బెలూన్లలో షికార్ చేసేందుకు ఆన్‌లైన్‌లో 4 వేల మంది నమోదు చేసుకున్నారు. బెలూన్లు 5 వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే అవకాశం ఉన్నప్పటికీ ఎయిర్ ట్రాఫిక్ నిబంధనల కారణంగా 2,500 అడుగుల ఎత్తున విహరించవచ్చు.
ఒక్కో బెలూన్ గంటపాటు ఆకాశయానం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో ఒకసారి ఐదుగురు వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు ఉంది. ఈ విధంగా రోజుకి 70మంది ఆకాశం నుంచి అరకు ఏజెన్సీ అందాలు చూసే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున లాటరీ తీసి మొత్తం 210 మందికి ఆకాశయానం చేసే అవకాశం కల్పిస్తామని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. గత ఏడాది బెలూన్ ఫెస్టివల్ నిర్వహించినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దయింది.