oil theft: చమురు చౌర్యం కోసం సొరంగాన్నే తవ్వారు... ప్రధాన పైపులైన్ నుంచే చోరీ
- హైదరాబాద్ శివార్లలో ఓ ముఠా బరితెగింపు
- నెల రోజుల్లో 1.3 లక్షల లీటర్ల డీజిల్ అపహరణ
- నిఘా పెట్టి పట్టుకున్న పోలీసులు
పన్నెండు మంది సభ్యులతో కూడిన ఓ ముఠా చమురు కంపెనీల (ఐఓసీఎల్/బీపీసీఎల్) ప్రధాన పైపులైన్ నుంచి ఆయిల్ చౌర్యానికి భారీ పథక రచన చేసింది. ఏకంగా పైపులైన్ వద్దకు సొరంగాన్ని నిర్మించి ప్రత్యేక పైపు ద్వారా చమురు చౌర్యానికి పాల్పడింది. నెల రోజుల్లోనే గుట్టురట్టు కావడంతో పోలీసులకు చిక్కారు.
హైదరాబాద్, రాచకొండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఘట్‌కేసర్ నుంచి చర్లపల్లి ఐఓసీఎల్/బీపీసీఎల్ అయిల్ సంస్థల నిల్వ కేంద్రాలకు ఆయిల్ సరఫరా చేసేందుకు 17 కిలోమీటర్ల పొడవున ప్రధాన పైపులైన్ ఉంది. మహారాష్ట్రలోని థానే జిల్లా ముమ్రా అమృత్‌నగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ హపీజ్ అజీజ్ చౌదరి, ముంబయికి చెందిన జియావుల్ చాంద్‌షేక్ అలియాస్ చెడ్డీ బెంగాలి, సర్జూ, సురేష్‌కుమార్ ప్రజాప్రతి, మహబూబ్‌నగర్‌కు చెందిన బిన్ని శ్రీనివాసులు నేతృత్వంలోని ముఠా ఈ పైపులైన్ నుంచి ఆయిల్ చోరీకి నిర్ణయించింది. దీంతో అజీజ్ చౌదరి హైదరాబాద్‌లోని బహుదూర్‌పురాలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడిపే తన బంధువు మహ్మద్ అబ్దుల్ అబ్రార్‌ను సంప్రదించి పథకం వివరించాడు.
అనంతరం ప్రధాన పైపులైన్ పక్కన కీసరలో ఉంటున్న మహేంద్రగౌడ్ ఖాళీ స్థలం ఉండడంతో అతన్ని సంప్రదించారు. వేరే అవసరాల నిమిత్తం అని ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఆ స్థలంలో చిన్న రేకుల షెడ్డు నిర్మించారు. నాలుగు నెలల క్రితం ఈ షెడ్డు అంతర్భాగం నుంచి పైపులైన్ వద్దకు 10 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో సొరంగాన్ని తవ్వారు. చమురు సంస్థల పైపు బయటపడ్డాక పైపులైన్‌కు క్లాంప్‌లు బిగించి రెండు అంగుళాల రంద్రం చేశారు.
ఆ సమయంలో పైపు ఏమాత్రం వేడెక్కినా, చిన్న స్పార్క్ వచ్చినా భారీ విస్పోటనం సంభవిస్తుంది. అయితే ఈ విషయంలో అనుభవం ఉన్న చెడ్డీ బెంగాలి తెలివిగా రంధ్రం
చేసి ప్రత్యేక పైపును అమర్చాడు. అనంతరం ఈ క్లాంప్‌ను నియంత్రిస్తూ ప్రధాన పైపు నుంచి డీజిల్‌ను తమ షెడ్డులోని డ్రమ్ముల్లో నింపేవారు. దీన్ని సూర్యాపేటకు చెందిన నరేష్‌రెడ్డి, తుంగతుర్తికి చెందిన మారోజు జయకృష్ణ, వరంగల్‌కు చెందిన వజినేపల్లి శ్రీకాంత్, ముంబయికి చెందిన రంగీలాల్ రాంబలియాదవ్, సునీల్ అనిల్ మాధివార్‌లు వరంగల్, బాచుపల్లి, బూర్గు, కోయిల్ కొండ, మహారాష్ట్రలోని ధర్మాబాద్ ప్రాంతాలకు తరలించి తక్కువ ధరకు విక్రయించే వారు.
నెల రోజుల్లో వీరు పైపులైన్ నుంచి రెండు సంస్థలకు చెందిన లక్షా 30వేల 601 లీటర్ల డీజిల్‌ను దొంగిలించారు. ఘట్‌కేసర్ నుంచి తమ సంస్థకు బంకుల్లోకి సరఫరా అవుతున్న డీజిల్ పరిమాణంలో తేడా రావడం రెండు సంస్థల ప్రతి నిధులు గత ఏడాది డిసెంబరు 3న గుర్తించారు. పైపులైన్ మార్గంలో నిఘా పెట్టగా నిర్మానుష్య ప్రాంతంలో షెడ్డు నిర్మించి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు షెడ్డుపై దాడిచేసి నిందితులైన అజిజ్ చౌదరి, శ్రీనివాసులు, అబ్దుల్ అబ్రార్, జయకృష్ణ, సర్జూర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 90.4 లక్షల నగదు, డీజిల్ ట్యాంకర్, స్కార్పియో, హోండా యాక్టివా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.