Andhra Pradesh: ‘రైతు బంధు’ లాంటి కొత్త పథకం తీసుకురానున్న ఏపీ ప్రభుత్వం
- ఇటీవల పెన్షన్లు పెంచిన చంద్రబాబు సర్కారు
- రైతులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయం
- కౌలు రైతులకూ వర్తింపజేసే ఆలోచన
ఇటీవల పలు పెన్షన్ పథకాలకు అందజేస్తున్న మొత్తాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణనీయంగా పెంచిన సంగతి తెలిసిందే. ఈసారి రైతులను ఆకట్టుకునేలా మరో కీలక పథకానికి ఏపీ సీఎం రూపకల్పన చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రైతు బంధు’ లాంటి పథకాన్ని తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇందులో భాగంగా రైతులను ఆదుకునేందుకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు సమాచారం. రైతు బంధు పథకంలా కాకుండా దీన్ని కౌలు రైతులకు సైతం వర్తింపజేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో ఈ నెల 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించి, ఈ పథకానికి తుది ఆమోదం తెలపనున్నారు. రైతు పెట్టుబడి సాయంపై ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే కసరత్తును ప్రారంభించారు. ఈ ఖరీఫ్ నుంచే రైతులకు పెట్టుబడి సాయం అందించాలని యోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.