Andhra Pradesh: ఏపీ ప్రభుత్వంపై తలసాని విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు!
- రేపు కోల్ కతా ర్యాలీకి వెళుతున్నాను
- టీఆర్ఎస్, వైసీపీ తప్ప అందరూ వస్తున్నారు
- టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు
రేపు కోల్ కతాలో జరిగే బీజేపీయేతర రాజకీయ పార్టీల ర్యాలీకి తాను హాజరవుతున్నట్లు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. టీఆర్ఎస్, వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు ఆ ర్యాలీకి వస్తున్నారని చెప్పారు. దీన్ని బట్టే ఆ రెండు పార్టీలు ఎక్కడ ఉన్నాయో తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు. నిరంకుశత్వాన్ని ఎదిరించడాన్ని ఎన్టీఆరే నేర్పారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో బీజేపీ రూపంలో నిరంకుశత్వం.. ప్రధాని మోదీ రూపంలో పెత్తందారీతనం ఉన్నాయని విమర్శించారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.
ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా, అలాగే కనకదుర్గమ్మ ఆలయం వద్ద టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాసయాదవ్ చేసిన కామెంట్లపై ఏపీ సీఎం స్పందించారు. తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిందని చంద్రబాబు గుర్తుచేశారు. తద్వారా తూర్పుకాపు, కళింగ, గవర వంటి సామాజికవర్గాలకు అన్యాయం చేశారని విమర్శించారు.
అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఏపీకి వచ్చి బీసీల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని తలసాని వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. ప్రస్తుతం దేశంలో మోదీ అనుకూల కూటమి, వ్యతిరేక కూటమి మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, వైసీపీ మోదీ అనుకూల కూటమిలో ఉన్నట్లేనని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకుండా బీజేపీ నేతలు కడపలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.