Tamilnadu: పొరపాటున హెచ్ఐవీ బాధితురాలిగా మారిన గర్భిణి... ఆడబిడ్డ జననం, డాక్టర్లలో టెన్షన్!
- తమిళనాడులో తీవ్ర సంచలనం కలిగించిన ఘటన
- 9 మంది వైద్య బృందం పర్యవేక్షణలో నార్మల్ డెలివరీ
- 45 రోజుల తరువాత బిడ్డకు రక్త పరీక్ష
తమిళనాడులో తీవ్ర సంచలనం కలిగించిన 'గర్భిణికి హెచ్ఐవీ రక్తం' ఉదంతంలో బాధిత మహిళ, పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. బ్లడ్ బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో గర్భిణికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఘటన తీవ్ర కలకలం రేపగా, ఆమె డెలివరీ కోసం ప్రభుత్వం 9 మంది వైద్యుల బృందాన్ని నియమించింది. ఆమెకు సాధారణ ప్రసవం జరిగిందని చెప్పిన వైద్యులు, బిడ్డకు హెచ్ఐవీ సోకిందా అన్న టెన్షన్ లో ప్రస్తుతం ఉన్నారు. ఈ పరీక్షను మరో 45 రోజుల తరువాత చేస్తామని వైద్య బృందం వెల్లడించింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
శివకాశి ప్రభుత్వ ఆసుపత్రిలో 19 సంవత్సరాల యువకుడు తనకు హెచ్ఐవీ సోకిందన్న విషయం తెలియకపోవడంతో రక్తదానం చేయగా, ఆసుపత్రి సిబ్బంది రక్తాన్ని పరీక్షించకుండానే బాధితురాలికి ఎక్కించారు. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన తరువాత మహిళా సంఘాలు, హైకోర్టు, తమిళనాడు సర్కారు స్పందించిన సంగతి తెలిసిందే. ఆమెకు రూ. కోటి పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.