KTR: కేటీఆర్, నన్ను మీ వాడిగా భావించండి: టీఆర్ఎస్ అగ్రనేతను కశ్మీర్ కు ఆహ్వానించిన ఒమర్ అబ్దుల్లా
- మంచుతో కప్పబడిన తన ఇంటిని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒమర్
- తనకు అక్కడకి వెళ్లాలని ఉందన్న కేటీఆర్
- ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రావచ్చన్న ఒమర్
జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలను ముమ్మరం చేసిన వేళ... మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రస్తుతం కశ్మీర్ లో భారీ స్థాయిలో మంచుకురుస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ లోయ మొత్తం మంచు దుప్పట్లో ఉంది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ఇల్లు, ఇంటి ప్రాంగణం మంచుతో కప్పబడిన ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
ఈ ఫొటోపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 'మన కోరికలను నెరవేర్చే ఫ్యాక్టరీ ఉంటే... నేను అక్కడకు వెళ్లాలని కోరుకుంటా' అంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ కు ఒమర్ అబ్దుల్లా స్నేహపూర్వకంగా స్పందించారు. 'నన్ను నీ వ్యక్తిగా భావించు. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే... అప్పుడు మా ఇంటికి రావచ్చు. ఇక్కడ ఉండవచ్చు' అని ట్వీట్ చేశారు. దీనికి స్పందనగా ఒమర్ సాబ్ ఆఫర్ ను తాను స్వీకరిస్తున్నానని కేటీఆర్ మరో ట్వీట్ చేశారు.
ఈ స్నేహపూర్వక ట్వీట్లు మీడియా దృష్టిని ఆకర్షించాయి. జాతీయ మీడియాలో కూడా దీనిపై కథనాలు వెలువడ్డాయి. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ... 'ఏదో సరదాగా, స్నేహపూర్వకంగా జరిగిన సంభాషణకు మీడియా ఇంత ప్రాధాన్యత ఇస్తుందని అనుకోలేదు' అంటూ మరో ట్వీట్ చేశారు.