Hyderabad: అమ్మో...వీడు మామూలోడు కాదు.. యావజ్జీవ కారాగార శిక్ష పడినా పన్నెండేళ్లుగా బయటే!
- అనూహ్యంగా పోలీసులకు చిక్కిన పాత నేరస్థుడు
- చైన్‌స్నాచింగ్ కేసు విచారణలో బయటపడిన వైనం
- అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు
పలు కేసుల్లో నిందితుడు...ఓ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడింది...జైలు శిక్ష అనుభవిస్తుండగానే పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు...దర్జాగా బయట తిరుగుతూ మళ్లీ చోరీలకు పాల్పడుతూ అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. తీగలాగితే డొంకంతా కదలడంతో ‘అమ్మో...వీడు మామూలోడు కాదు’ అని పోలీసులే నోరు వెళ్లబెట్టాల్సి వచ్చింది.
హైదరాబాద్, రాచకొండ క్రైం డీసీపీ నాగరాజు తెలిపిన వివరాలు ఇవీ. సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ ముజాహిద్ అలియాస్ ముజ్జు (48) నగరంలోని యాఖుత్‌పురా నివాసి. తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు, ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో బంగారం తెంచుకుపోవడం, లోడు చేసి ఉన్న లారీల నుంచి స్టీల్ దొంగిలించడం వంటి నేరాలకు పాల్పడేవాడు. ఆ విధంగా నగరంలోని 18 ఠానాల పరిధిలో 20 కేసులు ఇతనిపై నమోదై ఉన్నాయి. 2004లో కుల్సుంపురా ఠానా పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో అరెస్టయి జైలుకు వెళ్లాడు. నగరానికి చెందిన ఖుర్షిద్, ఫయాజ్, గౌస్, జకీర్‌లతో జైలులో ఇతనికి పరిచయమైంది. ఆరు నెలల తర్వాత బెయిలుపై బయటకు వచ్చాక వీరంతా ఓ ముఠాగా ఏర్పడ్డారు.
2007లో బీదర్‌లోని జాన్వాడలో దోపిడీకి పాల్పడ్డారు. ఇలా చోరీలు, దొంగతనాలు కొనసాగిస్తుండగానే కుల్సుంపురా ఠానా హత్య కేసులో న్యాయస్థానం అబ్దుల్ రెహ్మాన్‌ను దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో ఇతన్ని పోలీసులు తిరిగి జైలుకు పంపారు. జైలు శిక్ష అనుభవిస్తుండగా జాన్వాడ దోపిడీ కేసు విచారణ కోసం అబ్దుల్‌తోపాటు ఇతర ముఠా సభ్యులను పోలీసులు న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు తరలిస్తుండగా వారి కళ్లుగప్పి పరారయ్యారు. తర్వాత మిగిలిన వారంతా పోలీసులకు చిక్కినా అబ్దుల్ రెహ్మాన్ మాత్రం చిక్కలేదు.
పోలీసుల నుంచి తప్పించుకున్న రెహ్మాన్ బీదర్‌లోని ఓ మారుమూల పల్లెటూరుకు చేరుకుని అక్కడ చికెన్ దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికీ తెలియకుండా జీవనం సాగిస్తుండేవాడు. ఇలా పన్నెండేళ్లు గడిపేశాడు. తన తల్లికి అనారోగ్యంగా ఉందని తెలియడంతో ఇటీవలే నగరంలో అడుగుపెట్టాడు. చేతి ఖర్చుకు కూడా డబ్బుల్లేక పోవడంతో మళ్లీ చోరీలకు తెగబడ్డాడు. ఈనెల 13న తన సోదరుడైన జావేద్ (33)తో కలిసి ఆటోలో వెళ్లాడు. సరూర్‌నగర్ ఠానా పరిధిలోని విష్ణుపురి కాలనీలో ఇంటి ముందు వాకిలి ఊడ్చుతున్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు తెంచి పరారయ్యారు.
సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా ఆటో నంబరు గుర్తించిన పోలీసులు జావెద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పాతనేరస్థుడైన అబ్దుల్ రెహ్మాన్ గుట్టు కూడా రట్టయింది. పన్నెండేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్థుడు అతనేనని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. వీరి నుంచి రెండు తులాల బంగారం గొలుసు, రెండు సెల్‌ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.