south central railway: ఇంజనీరింగ్ పనుల నేపథ్యంలో.. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దు
- మరికొన్ని రైళ్లు పాక్షికంగా...
- ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు అమలు
- గూడూరు జంక్షన్‌లో ఇంజనీరింగ్ పనులే కారణం
దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఈనెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సీనియర్ మండల వాణిజ్య అధికారి ఉమామహేశ్వరరావు తెలిపారు. ఓ రైలు ఈనెల 20 నుంచి 30 వరకు, మరో రైలు ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 1 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గూడూరు జంక్షన్‌లో పలు ఇంజనీరింగ్ పనులు చేపడుతుండడంతో రద్దు అనివార్యమైందని వివరించారు.
ఈ కారణంగా గుంటూరులో 12.10 గంటలకు బయలుదేరి డోన్‌కు వెళ్లే రైలు(57328) ఈనెల 31 వరకు, డోన్‌లో 6.30కి బయలుదేరి గుంటూరు వచ్చే రైలుని(57327) వచ్చే నెల 1 వరకు రద్దు చేసినట్లు తెలిపారు. గుంటూరులో 5.15కి బయలుదేరి కాచిగూడ వెళ్లే రైలు (77281)ని గుంటూరు-డోన్ మధ్య ఈనెల 31 వరకు, కాచిగూడలో 5.10కి బయలుదేరి గుంటూరు వచ్చే రైలు (77282)ని డోన్-గుంటూరు మధ్య ఈనెల 31 వరకు రద్దు చేసినట్లు తెలిపారు.
అలాగే రేపల్లెలో 4 గంటలకు బయలుదేరి మార్కాపురం వెళ్లే రైలు(77247) గుంటూరు-మార్కాపురం మధ్య, మార్కాపురంలో 10.05కి బయలుదేరి తెనాలి వెళ్లే రైలు(77249)ని మార్కాపురం-గుంటూరు మధ్య ఈనెల 21 నుంచి 31 వరకు రద్దు చేసినట్లు వివరించారు. ఇక గుంటూరులో ఒంటి గంటకు బయలుదేరి తిరుపతికి వెళ్లే రైలు(67232)ని బిట్రగుంట-తిరుపతి మధ్య ఈ నెల 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు చెప్పారు. తిరుపతిలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి గుంటూరు వచ్చే రైలు (67231)ని తిరుపతి-బిట్రగుంట మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.