Andhra Pradesh: జగన్-కేసీఆర్ ఏడాది కాలంగా కలిసి పనిచేస్తున్నారు.. ఇప్పుడు కొత్తగా ఏం జరగలేదు!: జేసీ దివాకర్ రెడ్డి

  • మరో 10 మంది కేసీఆర్ లు వచ్చినా టీడీపీకి ఢోకా లేదు
  • ఇప్పుడు కేసీఆర్ కు కోపం వచ్చిందని వ్యాఖ్య
  • ఉండవల్లిలో సీఎం తో జేసీ సోదరుల భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అలాంటి 10 మంది వ్యక్తులు కలిసి వచ్చినా ఏపీలో టీడీపీని ఏమీ చేయలేరని ఆ పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ నుంచి వచ్చి బురద చల్లేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. టీఆర్ఎస్-వైసీపీలు దాదాపు ఏడాది క్రితం నుంచి కలిసి పనిచేస్తున్నాయనీ, కొత్తగా ఇప్పుడేం కలవలేదని స్పష్టం చేశారు. ఉండవల్లిలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్న అనంతరం జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని జేసీ తెలిపారు. ఒక్కోసారి ఒక్కొక్కరికి కోపం వస్తుందనీ, ఇప్పుడు కేసీఆర్ కు వచ్చిందని ఆయన అన్నారు. జగన్ సోదరి షర్మిలను తాను వ్యక్తిగతంగా విమర్శించలేదని జేసీ పునరుద్ఘాటించారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ.. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు అస్మిత్ రెడ్డి, దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డిలకు టికెట్లపై చంద్రబాబుతో చర్చించలేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గంలోని సమస్యలపై చర్చించేందుకే సీఎంతో భేటీ అయ్యామని తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News