prasanth kishore: ప్రశాంత్ కిషోర్ మాకేమీ కొత్తకాదు: బీహార్ సీఎం నితీష్‌కుమార్
- 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనతో కలిసి పనిచేశాం
- అమిత్‌షా కూడా తీసుకోవాలని రెండు సార్లు సూచించారు
- రాజకీయాల్లోకి యువతను తెచ్చేందుకు ఆయన ఉపయోగపడతారు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తమకు కొత్తేమీ కాదని, 2015 ఎన్నికల్లో ఆయనతో కలిసి పనిచేశామని జనతాదళ్ (యూ) చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రశాంత్ కిషోర్ జేడీ(యూ)లో చేరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాట్నాలోని ఓ ప్రైవేటు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్‌కుమార్ మాట్లాడుతూ, రాజకీయేతర కుటుంబాల్లో పుట్టి రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉన్నా అవకాశాల్లేకపోతున్న యువతను పార్టీలోకి ఆహ్వానించేందుకు పీకే ఉపయోగపడతారన్నారు.
యువతలోని రాజకీయ ప్రతిభను వెలికితీసేందుకే ప్రశాంత్ కిషోర్‌కు ఉపాధ్యక్షుడి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా పీకేని పార్టీలో చేర్చుకోవాల్సిందిగా రెండుసార్లు సూచించారని, ఇదే ఆయనలోని ప్రతిభకు నిదర్శనమన్నారు. పీకే పట్ల తనకెంతో వాత్సల్యం ఉందని, దానికి వారసత్వం అన్న మాట ఉపయోగించడం సరికాదని, మనమేమీ రాజుల నాటి కాలంలో లేమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.