Maharashtra: బాల్ ఠాక్రే అతనిని హత్య చేయించాలనుకున్నారు!: మాజీ సీఎం కొడుకు నీలేశ్‌రాణే సంచలన వ్యాఖ్యలు
- ప్రముఖ గాయకుడు సోను నిగమ్‌ను చంపాలనుకున్నారు
- ఇలాంటి నిజాలు చాలా ఉన్నాయి
- మానాన్న నారాయణ్ రాణేను అంటే అవన్నీ బయటపెడతా
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే కుమారుడు, మాజీ ఎంపీ నీలేశ్‌రాణే శివసేన వ్యవస్థాపకుడు, దివంగత బాల్‌ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్‌ను చంపించాలని ఓ సందర్భంలో బాల్ ఠాక్రే కుట్రపన్నారని ఆయన బాంబు పేల్చారు.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో శివసేన నాయకుడు వినాయక్ రౌత్, ఒకప్పటి శివసేన నాయకుడైన నారాయణ్ రాణేపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నీలేశ్ తన తండ్రి గురించి తప్పుగా మాట్లాడితే తానూ నోరు విప్పగలనంటూ ఈ బాంబు పేల్చారు.
‘ఠాక్రే సాహెబ్‌ను నేను ఎప్పుడూ తప్పుపట్టలేదు. కానీ నా తండ్రి గురించి మాట్లాడాక చెప్పాల్సి వస్తోంది. సాహెబ్, సోనూ నిగమ్‌ను చంపించాలనుకున్నారు. అలాగని ఠాక్రే కుటుంబానికి, సోనుకు ఏమిటి సంబంధం? అని నన్ను అడగకండి. అది అంతే. నా తండ్రి గురించి తప్పుగా మాట్లాడితే ఇలాంటి విషయాలు చాలా బయటపెట్టగలను’ అంటూ హెచ్చరించారు నీలేశ్.
శివసేన పార్టీలో ఉన్నప్పుడు నీలేశ్ తండ్రి నారాయణ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఠాక్రే మరణం తర్వాత ఆయన తనయుడు ఉద్ధవ్ అతన్ని పార్టీ నుంచి తొలగించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్పటి నుంచి రాణే కుటుంబానికి, శివసేకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.