Andhra Pradesh: జగన్ టీఆర్ఎస్ తో కలిసి ఏం సాధిస్తారు?: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు
- మోదీ కుట్రలో భాగంగానే టీడీపీ-వైసీపీ ములాఖత్
- ఈ విషయాన్ని మేం ముందుగానే చెప్పాం
- జగన్, కేసీఆర్.. వీరంతా మోదీ చేతిలో కీలుబొమ్మలు
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు వైసీపీ అధినేత జగన్ తో భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ-టీఆర్ఎస్ భేటీపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ పై ప్రధాని నరేంద్ర మోదీ కక్ష కట్టారనీ, ఆయన కుట్రలో భాగంగానే టీఆర్ఎస్-వైసీపీ జత కడుతున్నాయని కృష్ణా జిల్లా టీడీపీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల ఆర్జునుడు ఆరోపించారు. వీరి లోపాయికారి ఒప్పందాలపై తాము గతంలోనే హెచ్చరించామన్నారు.
అయితే తమను అప్పట్లో ఎవ్వరూ విశ్వసించలేదనీ, ఇప్పుడు వీరి ముసుగులు తొలగిపోయి నిజాలు బయటకు వచ్చాయని వ్యాఖ్యానించారు. జగన్ టీఆర్ఎస్ తో కలిసి ఏపీలో ఏం సాధిస్తారు? అని ప్రశ్నించారు. తెలంగాణ కంటే ఏపీలో అభివృద్ధి అద్భుతంగా ఉందని తెలిపారు. ఏపీలో 95 శాతం అభివృద్ధి ఉంటే అది తెలంగాణలో 65 శాతానికే పరిమితమయిందని పేర్కొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమానికి నిలువుటద్దమని కితాబిచ్చారు. దాదాపు 54 లక్షల మందికి పెన్షన్ ను రూ.2,000కు పెంచామన్నారు. జగన్, కేసీఆర్.. వీరంతా మోదీ చేతిలో కీలుబొమ్మలని విమర్శించారు. కార్పొరేటర్ గా 156 ఓట్లు దక్కించుకున్న తలసాని శ్రీనివాసయాదవ్ కూడా ఏపీకి వచ్చి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కేటీఆర్, జగన్ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో సమావేశం కానున్న సంగతి తెలిసిందే.