kenya: కెన్యాలో ఆత్మాహుతి దాడి... విదేశీయులే లక్ష్యంగా రెచ్చిపోయిన ఉగ్రమూకలు

  • తొలుత వాహనాలపైకి బాంబులు విసిరిన దుండగులు
  • 10 నుంచి 15 మంది చనిపోయినట్లు అనుమానం
  • నైరోబిలోని వెస్ట్‌ల్యాండ్స్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలో ఘటన

కెన్యా రాజధాని నైరోబిలో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. విదేశీయులే లక్ష్యంగా ఓ హోటల్‌పై దాడులకు తెగబడ్డారు. నైరోబిలోని వెస్ట్‌ల్యాండ్స్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలో ‘డస్టిట్‌ డీ2’ హోటల్‌ వద్ద జరిగిన ఈ ఘటనలో 10 నుంచి 15 మంది వరకు చనిపోయారని ప్రాథమికంగా నిర్థారించారు. వివరాల్లోకి వెళితే...విదేశీయులు అధికంగా ఉండే హోటల్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రమూకలు తొలుత హోటల్‌ ప్రాంగణంలో పార్కింగ్‌ చేసి ఉన్న వాహనాలపైకి బాంబులు విసిరి భయోత్పాతం సృష్టించారు. అనంతరం ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు. దాడి అనంతరం ముష్కరులు తుపాకులతో కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఐదుగురు ఘటనా స్థలిలోనే మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

చనిపోయిన వారిలో ఓ అమెరికన్‌ కూడా ఉన్నారని భావిస్తున్నారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాకున్నా 10 నుంచి 15 వరకు ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి సమాచారం అందగానే హుటాహుటిన చేరుకున్న భద్రతా బలగాలు హోటల్‌ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఘటనను ఆ దేశ మంత్రి ఫ్రెడ్‌మాషియాంగ్‌ ఖండించారు. ఉగ్రమూకలు ఇటువంటి చర్యలతో తమని ఓడించలేవని ప్రకటించారు. కాగా, ఘటనకు తామే బాధ్యులమని ‘ఆల్‌ షహాబ్‌’ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

  • Loading...

More Telugu News