Andhra Pradesh: షర్మిళపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. కారకులపై చర్యలకు మాజీ మంత్రి దాడి డిమాండ్!
- షర్మిళను ఓ హీరోకు ముడిపెడుతూ వదంతులు
- హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిళ
- సుమోటాగా విచారణ చేపట్టాలని పోలీసులకు దాడి విజ్ఞప్తి
వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిళపై కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై షర్మిళ హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ వివాదంపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు స్పందించారు. షర్మిళపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని సుమోటాగా విచారణకు స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీరభద్రరావు మీడియాతో మాట్లాడారు.
నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని వీరభద్రరావు కోరారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కుమార్తెపై జరుగుతున్న ఈ దుష్ప్రచారంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోలేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు సత్వరం స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.