modi: పెద్ద పెద్ద ర్యాలీలను నిర్వహించడం మినహా మోదీ చేసిందేమీ లేదు: మాయావతి చురకలు
- బీఎస్పీ, ఎస్పీ పొత్తుతో విపక్షాలకు నిద్ర కరవైంది
- దేశ ప్రధాని ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారు
- పెద్ద ర్యాలీలను నిర్వహించడం మినహా మోదీ చేసిందేమీ లేదు
ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీల పునాదులు చాలా బలంగా ఉన్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు. స్వార్థపూరిత ప్రయోజనాలకు అతీతంగా బీఎస్పీ, ఎస్పీలు జతకట్టాయని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం తాము పెట్టుకున్న పొత్తుతో ప్రత్యర్థులకు నిద్ర కరవైందని చెప్పారు. పెద్ద పెద్ద ర్యాలీలను నిర్వహించడం మినహా ప్రధాని మోదీ చేసిందేమీ లేదని విమర్శించారు. భారీ ఎత్తున హామీలను ఇవ్వడం... ఆ తర్వాత వాటిని నిలబెట్టుకోలేకపోవడం మోదీ నైజమని అన్నారు. తన 63వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈమేరకు వ్యాఖ్యానించారు.
అక్రమ మైనింగ్ కేసులో అఖిలేష్ యాదవ్ పై సీబీఐ చర్యలకు దిగడం దురదృష్టకరమని మాయావతి అన్నారు. ఇదంతా బీజేపీ చేస్తున్న రాజకీయ కుట్రలో భాగమని మండిపడ్డారు. దేశ ప్రధాని ఎవరనే విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కు గుణపాఠమని అన్నారు. తప్పుడు హామీలతో ప్రజలను వంచించలేరని చెప్పారు. మూడు రాష్ట్రాల్లో రైతులకు చేసిన రుణమాఫీ సరిపోదని... రైతు ఆత్మహత్యలు ఆగేంత వరకు 100 శాతం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.