Donald Trump: వైట్ హౌస్ కిచెన్ బంద్.. చేసేదేమీ లేక ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసిన ట్రంప్!

  • అమెరికాలో కొనసాగున్న షట్ డౌన్
  • సిబ్బంది రాక మూతపడ్డ వైట్ హౌస్ కిచెన్
  • సొంత డబ్బు చెల్లించి.. ఫాస్ట ఫుడ్ ను తెప్పించిన ట్రంప్

డొనాల్డ్ ట్రంప్... ప్రపంచంలోని అగ్రదేశానికి అధినేత. అయితేనేం... శ్వేతసౌధంలో తినడానికి తిండి లేకపోవడంతో... బయట నుంచి ఆహారాన్ని తెప్పించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతోంది. జీతాలు అందకపోవడంతో ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో మరోవైపు, నేషనల్ ఛాంపియన్ షిప్ లో క్లెమెన్ టైగర్స్ యూనివర్శిటీ ఫుట్ బాల్ జట్టు విజయం సాధించింది. దీంతో, వారందరినీ ట్రంప్ శ్వేతసౌధానికి విందుకు ఆహ్వానించారు.

కానీ షట్ డౌన్ ఎఫెక్ట్ వల్ల శ్వేతసౌధంలోని ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో... వంటకాలను తయారు చేసేందుకు అక్కడ ఎవరూ లేరు. వైట్ హౌస్ కిచెన్ మూతపడిన నేపథ్యంలో చేసేది ఏమీ లేక... బయట నుంచి పిజ్జాలు, బర్గర్లను ట్రంప్ తెప్పించారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే తెలిపారు.

షట్ డౌన్ కారణంగా ఫాస్ట్ ఫుడ్ ను ఆర్డర్ చేయాల్సి వచ్చిందని... దానికి డబ్బును తానే చెల్లించానని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆటగాళ్ల కోసం పిజ్జాలు, 300 హాంబర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ను తెప్పించానని అన్నారు.

  • Loading...

More Telugu News