central government: కంప్యూటర్లలో నిల్వచేసే డేటా తనిఖీ ఆదేశాలపై స్పందించిన సుప్రీంకోర్టు
- నిఘా సంస్థల అధికారాలను పరిశీలిస్తామని వెల్లడి
- గత ఏడాది డిసెంబరు 20న కేంద్రం ఆదేశం
- దీనిపై కోర్టును ఆశ్రయించిన పలు సంస్థలు
స్మార్ట్ ఫోన్ నుంచి కంప్యూటర్ వరకు ఎందులో నిల్వచేసిన డేటా అయినా అవసరం వచ్చినప్పుడు నిఘా సంస్థలు తనిఖీ చేసేలా అధికారాలు కల్పిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్పందించింది. ఆయా సంస్థల అధికారాల పరిధిని పరిశీలించాక నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది.
వివరాల్లోకి వెళితే...కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్న డేటాపై నిఘా పెట్టడానికి పది కేంద్ర సంస్థలకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల కంప్యూటర్ వ్యవస్థలోని ఎలాంటి డేటానైనా ఇంటర్‌సెప్ట్ చేసేందుకు, పర్యవేక్షించేందుకు, డీక్రిప్ట్ చేసేందుకు ఈ సంస్థలకు అధికారం కలుగుతుంది. దీంతో కేంద్రం ఆదేశాలను సవాల్ చేస్తూ పలు సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కేంద్రం ఆదేశాలు వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనంటూ సదరు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది.