New Delhi: ఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన మహిళ
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
- అమర్‌జ్యోతి జవాన్ ప్రాంతానికి వెళ్లేందుకు యత్నం
- భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో నినాదాలు
దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ జరుగుతున్న సమయంలో ఓ మహిళ పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం సంచలనం రేపింది. అక్కడి అమర్‌జ్యోతి జవాన్ పాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సదరు మహిళ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఈ విధంగా నినదించడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్‌కు చెందిన సదరు మహిళ ముంబయిలోని బంధువు ఇంటికి వెళ్లేందుకు ఇంట్లో చెప్పకుండా రైలెక్కేసింది. అయితే, అనుకోని పరిస్థితుల్లో ఢిల్లీ వచ్చేసింది. ఢిల్లీలో దిగాక ఇండియాగేట్ ప్రాంతానికి చేరింది. అమర్‌జ్యోతి జవాన్ ప్రాంతానికి వెళ్లాలని చూడగా పోలీసులు అడ్డుకున్నారు. కానీ ఆమె వారిని తోసేసి ముందుకు వెళ్లడమేకాక ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించింది.
ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దాడిచేస్తూ హల్‌చల్ చేసింది. ఎట్టకేలకు ఓ మహిళా కానిస్టేబుల్ ఆమెను అడ్డుకుని పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఆ మహిళ గురించి ఆరాతీయగా వివరాలు వెల్లడయ్యాయి. ఆమె కనిపించడం లేదంటూ నిజామాబాద్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం బయటపడింది. దీంతో ఆ మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె మానసిక స్థితి సరిగా లేదని తేలింది. దీంతో ఆమెను షెల్టర్ హోంలో చేర్చారు.