Tirumala: తిరుమల వెంకన్న పేరు చెప్పి మోసం... భక్తుల నుంచి రూ. 20 లక్షలు కాజేసిన ఘనుడు!
- స్వామికి అభిషేకం, శేషవస్త్ర సత్కారం ఇప్పిస్తానని మోసం
- పలువురికి కుచ్చుటోపీ
- అరెస్ట్ చేసిన పోలీసులు
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి పేరు చెప్పగానే నమ్మేసిన భక్తులు ఓ మోసగాడికి రూ. 20 లక్షలు చెల్లించుకుని ఇప్పుడు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్, ఎస్సార్ నగర్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నెల్లూరు ప్రాంతానికి చెందిన ఆనం రాజ్ కుమార్ రెడ్డి, ఇందిరానగర్ లో ఉంటున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో తిరుమల శ్రీవారి భక్తులను ఎంచుకున్నాడు.
తనకు తిరుమలలో చాలా పరపతి ఉందని, స్వామికి అభిషేకం టికెట్లు ఇప్పించి, ఆపై శేషవస్త్రంతో సన్మానం చేయిస్తానని నమ్మబలికాడు. అభిషేకం కోసం రూ. 2500, శేషవస్త్ర సన్మానం కోసం రూ. 50 వేలు అవుతుందని చెప్పగా, అమీర్ పేటకు చెందిన సుకుమార్ రెడ్డి నమ్మి డబ్బిచ్చాడు. ఇదే తరహాలో రాజ్ కుమార్ పలువురిని మోసం చేశాడు. ఆయన చెప్పిన తేదీ వచ్చినా, టికెట్లు ఇప్పించక పోవడంతో అనుమానం వచ్చిన భక్తులు పోలీసులను ఆశ్రయించారు. పలువురి నుంచి రూ. 20 లక్షలను రాజ్ కుమార్ కాజేశాడని గుర్తించామని, అతన్ని అరెస్ట్ చేసి, కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.