Andhra Pradesh: ‘జగన్ పై దాడి కేసు’లో నేడు ఎన్ఐఏ విచారణ.. లాయర్ సలీంకు సమాచారం అందించిన అధికారులు!
- విశాఖ సీఆర్పీఎఫ్ క్యాంప్ లో శ్రీనివాసరావు
- నేడు విచారించనున్న ఎన్ఐఏ అధికారులు
- అక్టోబర్ 25న జగన్ పై కోడికత్తితో దాడి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు విశాఖపట్నంకు తరలించారు. జిల్లాలోని బక్కన్నపాలెం సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ లో శ్రీనివాసరావును ఉంచిన అధికారులు, అతని లాయర్ అబ్దుల్ సలీంకు సమాచారం అందించారు. విజయవాడ ప్రత్యేక కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ సమయంలో లాయర్ కు సమాచారం ఇవ్వాలని చెప్పడంతో అధికారులు ఈ మేరకు స్పందించారు. జగన్ పై దాడి కూడా విశాఖపట్నంలోనే జరగడంతో విచారణకు అనుకూలంగా ఉంటుందని ఇక్కడి సీఆర్పీఎఫ్ క్యాంప్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
విశాఖపట్నం విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్ 25న శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో జగన్ పై దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ జగన్ హైదరాబాద్ కు చేరుకుని శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం ఏపీ పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఈ దాడి ఘటనపై విచారణ జరిపించాలని జగన్ అప్పటి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.