Saudi Teen: ఇంటి నుంచి పారిపోయి థాయ్ లాండ్ చేరిన సౌదీ బిలియనీర్ కుమార్తె... ఆశ్రయమిచ్చిన కెనడా!
- ఆస్ట్రేలియాకు వెళ్లబోయి థాయ్ లాండ్ లో చిక్కుకుపోయిన అల్ ఖునన్
- ఆశ్రయం ఇస్తామని ప్రకటించిన కెనడా ప్రధాని
- కెనడాకు చేరుకున్న అల్ ఖునన్ కు స్వాగతం
సౌదీ అరేబియాలో తన ఇంటి నుంచి పారిపోయి, ఆస్ట్రేలియాకు వెళ్లబోయి, మధ్యలో థాయ్ లాండ్ లో చిక్కుకుపోయిన యువతి రహాఫ్ ముహమ్మద్ అల్ ఖునన్ (18) చివరికి కెనడాకు చేరుకుంది. సౌదీలో తన కుటుంబానికి చాలా పరపతి ఉందని, తిరిగి ఇంటికి వెళితే, తనను చంపేస్తారంటూ ఆమె సోషల్ మీడియాలో వాపోవడంతో, ఐరాస సహా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కదిలాయి.
ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానని ఆమె చెప్పగా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆశ్రయం ఇస్తామని వెల్లడించడంతో ఆమె కష్టాలు తొలగాయి. శనివారం నాడు ఆమె టొరంటోకు చేరుకోగా, స్వాగతం చెప్పేందుకు స్వయంగా వచ్చిన ఆ దేశ విదేశాంగ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్, "ధైర్యవంతురాలైన కొత్త కెనడియన్ కు స్వాగతం" అంటూ ఆమెను ఆహ్వానించారు. ఆమె ఇప్పుడు కెనడియన్ల మధ్యే ఉండనున్నారని, కొత్త ఇంటికి వచ్చారని ఫ్రీలాండ్ అన్నారు. కాగా, తనకు ఆశ్రయం ఇచ్చే విషయంలో ఆస్ట్రేలియా ఆలస్యం చేయడం వల్లే తాను కెనడాను ఎంచుకున్నానని విమానంలో వస్తూ, అల్ ఖునన్ తన సోషల్ మీడియా ఖాతాలో వ్యాఖ్యానించారు.