Andhra Pradesh: సీఐతో కానిస్టేబుల్ వాగ్వాదం.. వీఆర్ కు పంపిన అధికారులు.. ఆందోళనకు దిగిన ప్రజాసంఘాలు!
- అనంతపురంలోని శెట్టూరులో ఘటన
- ఫోన్ మాట్లాడుతూ కానిస్టేబుల్ నాయక్ డ్రైవింగ్
- మందలించిన సీఐ రవిబాబు
అనంతపురం జిల్లాలో పోలీసుల మధ్య గొడవ వీధికెక్కింది. బైక్ డ్రైవ్ చేస్తూ ఫోన్ లో మాట్లాడవద్దని ఓ కానిస్టేబుల్ ను సీఐ మందలించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు కానిస్టేబుల్ ను వీఆర్ కు పంపుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కానిస్టేబుల్ కు మద్దతుగా దళిత, గిరిజన, ప్రజా సంఘాలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగాయి.
జిల్లాలోని శెట్టూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ గోవిందనాయక్ నెల రోజుల క్రితం బైక్ పై వెళూతు ఫోన్ లో మాట్లాడాడు. దీన్ని గమనించిన సీఐ రవిబాబు ఆయన్ను మందలించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో గోవిందనాయక్ ను వీఆర్ కు పంపుతూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఈ నేపథ్యంలో మనస్తాపానికి లోనైన గోవిందనాయక్ తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
తన భార్య అనారోగ్యానికి గురికావడంతో తొందరగా బైక్ పై వెళుతున్నాననీ, అప్పుడే కాల్ రావడంతో లిఫ్ట్ చేశానని వాపోయారు. ఈ సందర్భంగా సీఐ రవిబాబు తనను దుర్భాషలాడారని ఆరోపించారు. మరోవైపు కానిస్టేబుల్ గోవిందనాయక్‌కు అండగా సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న పలువురు కానిస్టేబుళ్లు సామూహిక సెలవులో వెళ్లేందుకు సిద్ధం కాగా, ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులు సర్దిచెప్పడంతో తాత్కాలికంగా విరమించుకున్నారు.
గోవిందనాయక్ కు మద్దతుగా ప్రజాసంఘాలు, దళిత, గిరిజన సంఘాలు శెట్టూరు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగాయి. దళిత, గిరిజన ఉద్యోగులను ఉన్నతాధికారులు వేధిస్తున్నారని ఆరోపించాయి. గోవిందనాయక్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దీంతో సీఐ రవిబాబు స్పందిస్తూ.. డీఎస్పీ ఆదివారం వస్తారనీ, ఆయన రాగానే చర్యలు తీసుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు. తాను వేధించినట్లు భావిస్తే గోవిందనాయక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చని రవిబాబు స్పష్టం చేశారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు.