Andhra Pradesh: కృష్ణా జిల్లాలో టీడీపీ నేత వర్సెస్ సబ్ కలెక్టర్.. చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్!
- మిషా సింగ్ రైతుల ప్రొక్లెయిన్ సీజ్ చేశారని ఆరోపణ
- భారీగా జరిమానా విధించారని వెల్లడి
- రైతులను ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో టీడీపీ పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, విజయవాడ సబ్ కలెక్టర్ మిషా సింగ్ ల మధ్య వివాదం ముదిరింది. మిషా సింగ్ వ్యవహారశైలిపై బోడె ప్రసాద్ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. ఓ రైతుకు చెందిన ప్రొక్లెయిన్ ను స్వాధీనం చేసుకున్న మిషా సింగ్.. భారీ జరిమానా విధించారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సబ్ కలెక్టర్ వ్యవహారశైలి రైతులను ఇబ్బంది పెట్టేలా ఉందని ఆరోపించారు.
మరోవైపు అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. పెనమలూరు మండలం వణుకూరులో రూ.10 కోట్లు విలువ చేసే 2.84 ఎకరాల పుల్లేరు కట్టభూమిని కొందరు చదును చేస్తున్నట్లు ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో రంగంలోకి దిగిన సబ్ కలెక్టర్ ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని, నిందితులను అరెస్ట్ చేయాలని పెనమలూరు ఎమ్మార్వో మురళీకృష్ణ, సిబ్బందిని ఆదేశించారు.
దీంతో అక్కడ భూమిని చదును చేస్తున్న ప్రొక్లెయిన్ ను అధికారులు సీజ్ చేశారు. రూ.2 లక్షల మేర జరిమానా విధించారు. అంతలోనే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రొక్లెయిన్ ను తన గెస్ట్ హౌస్ కు తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీషా సింగ్ తో వాదనకు దిగినట్లు తెలుస్తోంది.