Vijay shankar: పాండ్యా, రాహుల్ రిటర్న్స్.. అడిలైడ్ ఫ్లైటెక్కనున్న గిల్, విజయ్ శంకర్
- మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల ఫలితం
- విచారణ ముగిసే వరకు నిషేధం
- అడిలైడ్ వన్డేలో ఆడనున్న గిల్, విజయ్ శంకర్
మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి నిషేధానికి గురైన టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు నేడు ఇండియా ఫ్లైటెక్కనున్నారు. వారి స్థానాల్లో తమిళనాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్, అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన శుభ్‌మన్ గిల్ అడిలైట్ ఫ్లైట్ ఎక్కనున్నారు.
‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో పాల్గొన్న హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ మాట్లాడుతూ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. వారి వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తం కావడంతో బీసీసీఐ సీరియస్ అయింది. దర్యాప్తునకు ఆదేశిస్తూనే ఇద్దరినీ జట్టు నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బీసీసీఐ పాలక మండలి (సీవోఏ) ప్రకటించింది. అయితే, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ఈ ఇద్దరినీ వెనక్కి పిలిపించేది, లేనిదీ చెప్పలేదు. తాజాగా, ఈ విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. విచారణ ముగిసే వరకు వారు క్రికెట్ ఆడబోరని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వారి విమాన టికెట్లు బుక్ అయ్యాయని, నేడు భారత్ ఫ్లైట్ ఎక్కుతారని తెలిపాయి.
ఇక, వారిద్దరి స్థానాలను విజయ్ శంకర్, శుభ్‌మన్ గిల్‌తో భర్తీ చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో వన్డేలో వీరిద్దరూ ఆడతారని తెలిపింది.