Rape: కేసు వెనక్కి తీసుకోవడానికి నిరాకరించిన రేప్ బాధితురాలు.. విషం తాగించిన యువకులు
- ఢిల్లీలోని ద్వారక జిల్లాలో ఘటన
- ట్యూషన్ నుంచి వస్తుండగా అడ్డగించిన యువకులు
- బెయిలుపై ఇటీవలే బయటకు వచ్చిన నిందితులు
రేప్ కేసును వెనక్కి తీసుకోవడానికి నిరాకరించిన బాధిత బాలికతో బలవంతంగా విషం తాగించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ట్యూషన్ నుంచి వస్తున్న 17 ఏళ్ల బాధిత బాలికను బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు అడ్డగించారు. తమపై పెట్టిన రేప్ కేసును వెనక్కి తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అందుకామె నిరాకరించడంతో బలవంతంగా ఆమె నోట్లో విషం పోసి పరారయ్యారు. ఢిల్లీ శివారు డ్వార్కా జిల్లాలోని హస్త్‌సాల్ ప్రాంతంలో జరిగిందీ ఘటన.
సృహ కోల్పోయి రోడ్డుపై పడి ఉన్న బాలికను స్థానికులు సకాలంలో ఆసుపత్రిలో చేర్చడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కేసును వెనక్కి తీసుకోవాలని, కోర్టులో తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దని నిందితులు బెదిరించినట్టు బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల పేర్కొంది. తాను అంగీకరించకపోవడంతో చేతులు పట్టుకుని బలవంతంగా నోట్లో విషం పోసినట్టు తెలిపింది. బాలిక కిడ్నాప్, అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన నిందితులు ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.