Vishal Thakkar: మూడేళ్లుగా కనిపించకుండా పోయిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ నటుడు
- డిసెంబరు 31న పార్టీకి వెళ్తున్నట్టు తండ్రికి మెసేజ్
- మూడేళ్లుగా దొరకని ఆచూకీ
- విశాల్ తనను రేప్ చేశాడంటూ గాళ్ ఫ్రెండ్ కేసు
బాలీవుడ్ సినిమా ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’లో నటించిన విశాల్ ఠక్కర్ మూడేళ్లుగా కనిపించడం లేదు. డిసెంబరు 31, 2015న రాత్రి తాను పార్టీకి వెళ్తున్నానని, ఉదయం వస్తానని తండ్రికి మెసేజ్ చేసిన విశాల్ ఆచూకీ అప్పటి నుంచి గల్లంతైంది. విశాల్ అదృశ్యం కావడానికి రెండు నెలల ముందు అంటే.. అక్టోబరులో అతడి గాళ్ ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేసి మోసం చేశాడని ఆరోపించింది.
స్టార్‌వార్స్ సినిమాకు వెళ్దామని తనను పిలిచాడని, అయితే తాను రానని చెప్పడంతో రూ.500 తీసుకుని రాత్రి 10:30 సమయంలో బయటకు వెళ్లాడని విశాల్ తల్లి దుర్గ (60) తెలిపింది. విశాల్ చివరిసారి తన గాళ్ ఫ్రెండ్‌తో కలసి జనవరి 1, 2016న ఉదయం 11:45 గంటలకు ఘోడ్‌బందర్ రోడ్డులో కనిపించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత అతడి ఫోన్ ఆఫ్ అయిందని, రోడ్డు ప్రమాదంలో గాయపడి గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రిలో చేరిన దాఖలాలు కూడా లేవని పోలీసులు తెలిపారు. అతడి బ్యాంకు ఖాతా కూడా ఆ తర్వాత యాక్టివ్‌గా లేదని చెప్పారు.
సినిమాలు లేకపోవడం, రేప్ వివాదాలతో అతడు మానసికంగా దెబ్బతిని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఇటీవల విశాల్ మిస్సింగ్ కేసు కానిస్టేబుల్ రాజేశ్ పాండే వద్దకు వచ్చింది. అతడు ఇటువంటి కేసులను ఛేదించడంలో ఎంతో నేర్పరి. ఇప్పటి వరకు 800 మందిని వెతికి పట్టుకున్నాడు. అయితే విశాల్ ఆచూకీని కనుగొనడంలో అతడు కూడా విఫలమయ్యాడు.