Andhra Pradesh: ఏపీలో కోడి పందేలను ప్రోత్సహించం.. తూర్పుగోదావరిలో ఈసారి 19 సీట్లూ మావే!: హోంమంత్రి చినరాజప్ప
- కోడిపందేల విషయం కోర్టు పరిధిలో ఉంది
- ఉపాధి కోసం ఆటోలపై పన్ను రాయితీలిచ్చాం
- రాజమండ్రిలో మీడియాతో మంత్రి
ఆంధ్రప్రదేశ్ లో కోడి పందేలను ప్రభుత్వం ప్రోత్సహించబోదనీ, ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ప్రజల కోరిక మేరకే పెన్షన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.వెయ్యి నుంచి రూ.2,000కు పెంచారని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ఆటోలపై పన్నురాయితీ ఇస్తున్నామన్నారు. రాజమండ్రిలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చినరాజప్ప మీడియాతో మాట్లాడారు.
ఏపీ ప్రభుత్వం పెన్షన్ పెంపు కారణంగా 54 లక్షల మంది ప్రజలు లబ్ధి పొందుతారని చినరాజప్ప తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల్లో 70 శాతం మంది టీడీపీకి అనుకూలంగా ఉన్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లాను టీడీపీకి కంచుకోటగా ఆయన అభివర్ణించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 19 స్థానాలను దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తాము సంప్రదాయాలను గౌరవిస్తామనీ, ప్రజలందరూ సుఖసంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.