Kushaiguda: పోలీసులకు షాక్ ఇచ్చిన నిందితుడు.. లింగ నిర్ధారణ కోసం ఆసుపత్రికి తరలింపు!
- లింగ మార్పిడి చేయించుకున్నాని వెల్లడి
- తన పేరును షాభిన అస్మిగా పేర్కొన్న నిందితుడు
- పరీక్షలు జరిపి నివేదిక ఇవ్వాలని కోరిన పోలీసులు
కేసు విచారణలో భాగంగా ఓ నిందితుడు పోలీసులే అవాక్కయ్యేలా ఓ విషయం చెప్పాడు. దీంతో పోలీసులు ఏం చెయ్యాలో తెలియక డైలమాలో పడ్డారు. అసలు విషయంలోకి వెళితే... కార్ల చీటింగ్ కేసుకు సంబంధించి ఈ నెల 3న.. పోతులయ్య, సయ్యద్ సిరాజ్ హుస్సేన్‌లను హైదరాబాద్, కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో జెండర్ దగ్గర ఇద్దరినీ మగవాళ్లుగానే పేర్కొన్నారు. కానీ డైరీ నమోదు సమయంలో సయ్యద్ తాను ఆడపిల్లనని చెప్పి పోలీసులకు షాక్ ఇచ్చాడు.
తాను మూడేళ్ల క్రితం లింగ మార్పిడి చేయించుకున్నానని.. తన పేరు హుస్సేన్ కాదని.. షాభిన అస్మి అని.. తనది కరీంనగర్ జిల్లా ఫతేపూర్ అని పోలీసులకు చెప్పడంతో వారు కంగుతిన్నారు. దీంతో అసలు ఆ వ్యక్తి ఆడా? మగా? నిర్ధారణ కోసం అతనిని పంపుతూ, గాంధీ ఆసుపత్రికి లేఖ రాశారు. షాభిన అస్మి అలియాస్ సయ్యద్ సిరాజ్ హుస్సేన్‌కు వైద్య పరీక్షలు జరిపి నివేదిక ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. వైద్యుల నుంచి స్పష్టత వస్తే కానీ జెండర్ కాలమ్ నింపి.. చీటింగ్ కేసును పోలీసులు ఓ కొలిక్కి తీసుకురానున్నారు.