Dera Sacha Sauda: జర్నలిస్టు హత్య కేసులో డేరాబాబా దోషి.. సీబీఐ కోర్టు తీర్పు
- 2002 అక్టోబర్ లో జర్నలిస్ట్ రాంచందర్ హత్య
- డేరాబాబాతో పాటు మరో ముగ్గురుని దోషులుగా తేల్చిన కోర్టు
- జనవరి 17న శిక్షను ఖరారు చేయనున్న కోర్టు
జర్నలిస్టు రాంచందర్ ను హత్య చేసిన కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ (డేరాబాబు)ను పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఆయనతో పాటు నిర్మల్ సింగ్, కుల్దీప్ సింగ్, క్రిషన్ లాల్ అనే వ్యక్తులను దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. జనవరి 17న శిక్షను ఖరారు చేస్తామని ఈ సందర్భంగా కోర్టు తెలిపింది.
డేరాబాబా ప్రస్తుతం రోహ్ తక్ లోని జైల్లో ఉన్నాడు. ఈనాటి కోర్టు విచారణకు జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన హాజరయ్యాడు. 2002లో సిర్సాకు చెందిన జర్నలిస్టు రాంచందర్ హత్యకు సంబంధించి ప్రధాన కుట్రదారుడిగా డేరాబాబాను కేసులో పేర్కొన్నారు.
ఆశ్రమానికి వచ్చిన మహిళలను లైంగికంగా వేధిస్తూ, వారిపై డేరాబాబా అత్యాచారాలు చేస్తున్నట్టు రాంచందర్ వార్తలు రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో 2002 అక్టోబర్ 24న రాంచందర్ ను ఆయన నివాసంలోనే కాల్చి చంపారు. క్రిషన్ లాల్ కు చెందిన తుపాకీతో కుల్దీప్, నిర్మల్ లు రాంచందర్ ను చంపేశారు. దీనికి సంబంధించి 2003లో కేసు నమోదు కాగా... 2006లో సీబీఐకి కేసు బదిలీ అయింది. మరోవైపు, ఇద్దరు మహిళలను రేప్ చేసిన కేసులో డేరాబాబా ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.