Andhra Pradesh: ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రజాకర్షక పథకాలు ప్రకటించే ఛాన్స్!
- ఐదు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం
- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్న సభ
- ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమయింది. ఈ నెల 30 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి రెండో వారంలో ఎమ్మెల్సీల ఎన్నికల కోడ్ అమలులోకి రానుండటంతో సమావేశాలను ముందుగానే జరపాలని నిర్ణయం తీసుకుంది. జనవరి 30న గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఈ సమావేశాల సందర్భంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో పాటు పలు కీలక ప్రజాకర్షక పథకాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు ఇదే చివరి బడ్జెట్ కానుంది. కాగా, ఈ సమావేశాల సందర్భంగా టీడీపీ నేతలు కిడారి సర్వేశ్వరరావు, ఎంవీవీఎస్ మూర్తి మృతిపై సభ సంతాపం తెలపనుంది.