gaganyan: 2021లో అంతరిక్షంలోకి ముగ్గురు భారతీయులు.. టీమ్ లో మహిళలు కూడా!

  • డిసెంబర్ 2020, జూలై 2021లో రెండు మానవరహిత మిషన్లను నిర్వహిస్తాం
  • 2021 డిసెంబర్ లో వ్యోమగాములను పంపుతాం
  • మన వ్యోమగాముల్లో మహిళలు కూడా ఉంటారు

స్పేస్ టెక్నాలజీలో ఇప్పటికే అగ్రరాజ్యాలతో సమానంగా సత్తా చాటుతున్న భారత్ కీలక లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో'... తాజాగా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. గగన్ యాన్ మిషన్ ద్వారా 2021 డిసెంబర్ లో అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపడమే తమ లక్ష్యమని ఈరోజు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఇస్రో చీఫ్ కె.శివన్ స్పష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా ఆరు ఇంక్యుబేషన్ సెంటర్లు, రీసర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు శివన్ తెలిపారు. గగన్ యాన్ కు సంబంధించిన ప్రారంభ శిక్షణ భారత్ లోనే ఉంటుందని... ఆ తర్వాత అడ్వాన్స్డ్ ట్రైనింగ్ రష్యాలో ఉండే అవకాశం ఉందని చెప్పారు. మన వ్యోమగాముల్లో మహిళలు కూడా ఉంటారని తెలిపారు. రెండు మానవ రహిత మిషన్లను డిసెంబర్ 2020, జూలై 2021లో నిర్వహిస్తామని... వ్యోమగాములతో కూడిన మిషన్ ను డిసెంబర్ 2021లో నిర్వహిస్తామని చెప్పారు. గగన్ యాన్ ప్రాజెక్టు కార్యాచరణ మొదలైందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇస్రోకు కీలక మలుపు కాబోతోందని అన్నారు. భారతీయ విద్యార్థులను ఇస్రోకు తీసుకొస్తామని చెప్పారు. మన విద్యార్థులు నాసాకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగం సందర్భంగా గగన్ యాన్ ప్రాజెక్టును చేపట్టబోతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2022 కల్లా భరతమాత కుమార్తె కాని, కుమారుడు కానీ అంతరిక్షంలోకి వెళతారని మోదీ తెలిపారు.

మరోవైపు, గత నెలలో కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... గగన్ యాన్ ద్వారా 2022 నాటికి ముగ్గురు భారతీయ వ్యోమగాములను అంతరిక్షలోకి పంపబోతున్నట్టు ప్రకటించారు. వీరు ఏడు రోజుల పాటు అంతరిక్షంలో ఉంటారని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర కేబినెట్ రూ. 10వేల కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే... నింగిలోకి సొంతంగా వ్యోమగాములను పంపిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. మరోవైపు, గగన్ యాన్ ప్రాజెక్టుకు సహకారం అందించే విషయంలో రష్యా, ఫ్రాన్స్ లతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. 

  • Loading...

More Telugu News