Andhra Pradesh: నీ అంత నీచాతి నీచమైన వ్యక్తి ఎవ్వరూ లేరని ఎన్టీఆరే స్వయంగా చెప్పారు!: చంద్రబాబుపై కొడాలి నాని ఆగ్రహం
- జగన్ ను తప్పించలేమన్న భయం పట్టుకుంది
- అందుకే సొంత మీడియాతో తప్పుడు ప్రచారం
- ఇసుకతో రూ.25 వేల కోట్లు దోచేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారని వైసీపీ నేత కొడాలి నాని తెలిపారు. జగన్ పాదయాత్రను అడ్డుకోవడానికి చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశారని వ్యాఖ్యానించారు. గతంలో దివంగత సీఎం రాజశేఖరరెడ్డిపై కూడా ముఠా నాయకుడనీ, హత్యలు చేయిస్తాడని తన సొంత మీడియాతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారని మండిపడ్డారు.
కానీ అధికారంలోకి వచ్చిన వైఎస్ నిరుపేదలకు 48 లక్షల ఇళ్లు నిర్మించి, పేద పిల్లలకు ఫీజు రియంబర్స్ మెంట్ చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో నాని సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా జగన్ వస్తే ఆయన్ను అధికారం నుంచి తప్పించలేమన్న భయంతో చంద్రబాబు, ఆయన భజన పత్రికలతో తప్పుడు ఆరోపణలు చేయించారని కొడాలి నాని తెలిపారు.
జగన్ బెయిల్ కోసం సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారనీ, కేసుల మాఫీ కోసం మోదీ కాళ్లు పట్టుకున్నట్లు ఫిరాయింపు ఎమ్మెల్యేల ద్వారా చెప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ స్వయంగా తన నోటితో చంద్రబాబును మించిన అవినీతి చక్రవర్తి ఎవరూ లేరని చెప్పినట్లు పేర్కొన్నారు. ‘నీ గురించి, నీ బతుకు గురించి పిల్లనిచ్చిన మామే చెప్పాడు. నువ్వొక్క వెన్నుపోటు దారుడివి. నీ అంత నీచాతి నీచమైన వ్యక్తి ఎవరూ లేరని ఎన్టీఆరే చెప్పారు ’ అని దుయ్యబట్టారు.
చంద్రబాబు, టీడీపీ నేతలు ఉచిత ఇసుక ద్వారా రూ.25,000 కోట్లు, నీరు-మట్టి కింద మరో రూ.45,000 కోట్ల నిధులు, రాజధానిలో లక్షల కోట్ల భూములను స్వాహా చేశారని ఆరోపించారు. జగన్ నవరత్నాలు ప్రకటిస్తే అమలు చేయలేరని చంద్రబాబు విమర్శించారనీ, ఇప్పుడు అవే హామీలను తాను అమలు చేస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ చంక నాలుగున్నర సంవత్సరాలు నాకిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
అంతటి ప్రధాని లేడని చంద్రబాబు గతంలో కితాబు ఇచ్చారని గుర్తుచేశారు. తమ నాయకుడు జగన్ ప్రజలను నమ్ముకున్న వ్యక్తి అనీ, అందుకే 2014లో ఒంటరిగా పోటీ చేశాడని వ్యాఖ్యానించారు. ఈసారి కూడా ఒంటరిగానే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఇలాంటి చిల్లర పనులను ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు.