fog: కోస్తాపై పరుచుకుంటున్న మంచు దుప్పటి.. వాహనాల రాకపోకలకు ఇబ్బంది
- ఉదయం 9 గంటల వరకు ఇదే పరిస్థితి
- జాతీయ రహదారిపై నిలిచిపోతున్న వాహనాలు
- అప్రమత్తంగా వాహనాలు నడపాలని పోలీసుల సూచనలు
గత కొన్ని రోజులుగా కోస్తా అంతటా ఉదయం పూట మంచుదుప్పటి పరుచుకుంటోంది. ఉదయం 9 గంటలైనా ఇదే పరిస్థితి ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఎదురవుతోంది. రాష్ట్రం మీదుగా చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి వెళ్తుండడంతో మంచు కారణంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శుక్రవారం చిలకలూరిపేట నుంచి ఏలూరు వరకు పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. సాధారణంగా జాతీయ రహదారిపై ప్రయాణించే భారీ వాహనాలు, లారీలు ట్రాఫిక్ రద్దీ తక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో తెల్లవారు జాము నుంచి ఉదయం 8 గంటలలోపు ప్రయాణించాలని భావిస్తారు. అటువంటి వారికి పొగమంచు పెద్ద అడ్డంకిగా మారుతోంది. కన్నుపొడుచుకున్నా కానరానంతగా పొగమంచు కమ్మేస్తుండడంతో వాహనం నడపడం సవాల్‌గా మారుతోందని వాహన చోదకులు వాపోతున్నారు. లైట్లు వేసుకుని వెళ్తున్నా వంద అడుగు దూరంలోని వాహనం కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.
ఈ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని జాతీయ రహదారిపై పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపి సూచనలు చేస్తున్నారు.