Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్!
- స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న నేత
- కమలాపురం-పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా విజయం
- యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
ప్రముఖ కమ్యూనిస్టు నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి(97) ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివరామిరెడ్డి ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన బ్రెయిన్ డెడ్ కు గురికావడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు.
కడప గడ్డం వారి పల్లెలో 1922 ఫిబ్రవరి 25న శివరామిరెడ్డి జన్మించారు. ఆయన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. 1957లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు.
రైతులోకం, అరుణోదయ పత్రికలకు సంపాదకులుగా వ్యవహరించారు. 1996లో గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షకు దిగారు. కాగా, శివరామిరెడ్డి మృతిపై ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, శివరామిరెడ్డి అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.