Jagan: పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరిన జగన్... అభిమానుల కేరింతలు!

  • దారిపొడవునా అభిమానుల స్వాగతం
  • నడక మార్గంలో భద్రత కట్టుదిట్టం
  • జగన్ తో పాటు నడవనున్న దాదాపు 500 మంది!

ఈ ఉదయం హౌరా - యశ్వంత్ పూర్ దురంతో రైల్లో రేణిగుంట చేరుకున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, అక్కడి నుంచి రోడ్డు మార్గన తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. దారిపోడవునా వైకాపా కార్యకర్తలు, జగన్ అభిమానులు పెద్దఎత్తున మోహరించడంతో, జగన్ కాన్వాయ్ నిదానంగా గెస్ట్ హౌస్ కు చేరింది.

గెస్ట్ హౌస్ వద్ద చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలకు చెందిన పలువురు నేతలు జగన్ కు స్వాగతం పలికారు. 'సీఎం జగన్, సీఎం జగన్' అంటూ అభిమానులు కేరింతలు కొట్టారు. వారితో కాసేపు మాట్లాడిన జగన్, స్నానాదికాలు ముగించుకుని, కాసేపు విశ్రాంతి తీసుకుని అలిపిరి నుంచి తిరుమలకు నడకను ప్రారంభించనున్నారు. ఈ నడక కనీసం మూడున్నర నుంచి నాలుగు గంటల సమయం పట్టనుండగా, నడక మార్గంలో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు.

జగన్ వెంట పాదయాత్రలో పాల్గొని 3 వేల కిలోమీటర్లకు పైగా నడిచిన అభిమానుల్లో అత్యధికులు నిన్నటి రైల్లో జగన్ తో పాటే తిరుపతికి వచ్చారు. వారంతా నేడు జగన్ వెంట కాలినడకన తిరుమలకు చేరుకోనుండటంతో, వారికి కూడా స్వామి దర్శన ఏర్పాట్లు చేయాలని జగన్, స్థానిక నేతలను ఆదేశించారు. కాలినడక మార్గంలో రాజకీయ నినాదాలు వద్దని, కేవలం స్వామివారిని తలచుకుంటూ ముందుకు సాగుదామని జగన్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News