Hyderabad: సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే హైదరాబాదీయులకు పోలీస్ కమీషనర్ సూచన!
- తాళం వేసిన ఇళ్లే దొంగల లక్ష్యం
- సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వండి
- రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచామన్న అంజనీకుమార్
సంక్రాంతి పండగ నిమిత్తం సొంత ఊర్లకు వెళుతున్న హైదరాబాద్ ప్రజలు, సంబంధిత సెక్టార్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. నగర శివార్లలోని తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా, అంతర్రాష్ట్ర ముఠాలు చోరీలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని, ఇరుగు, పొరుగు వారికి కూడా సమాచారం ఇచ్చి పండగకు వెళ్లాలని ఆయన సూచించారు.
గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా దొంగతనాలను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచామని అన్నారు. గొలుసు చోరీలకు పాల్పడేవారిని పట్టుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని, దొంగలను పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. 2017తో పోలిస్తే, 2018లో చైన్ స్నాచింగ్ కేసులు 30 శాతం తగ్గాయని అంజనీకుమార్ చెప్పారు.