Rajya Sabha: ఎలాంటి గణాంకాలు లేకుండా ఈ రాజ్యాంగ సవరణ తేవడంలో అర్థమేంటి?: కపిల్ సిబాల్
- ఈబీసీ రిజర్వేషన్లకు గణాంకాలేమైనా ఉన్నాయా?
- ఒకవేళ ఉంటే వాటిని సభ ముందు ప్రవేశపెట్టాలి
- ఏం ఆలోచించి ఈ బిల్లు తయారు చేశారు?
ఈబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి గణాంకాలు లేకుండా ఈ రాజ్యాంగ సవరణ తేవడంలో అర్థమేంటి? అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కపిల్ సిబాల్ ప్రశ్నించారు. రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందుకు సంబంధించి సేకరించిన గణాంకాలు ఏమైనా ఉంటే, వాటిని సభ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యల కోసమేనా రాజ్యాంగ పరిషత్ మనకు అవకాశం అందించింది? ఒడిశాలో జనరల్ కేటగిరి జనాభా 6 శాతమేనని, వారికి 10 శాతం రిజర్వేషన్లు వస్తాయని, వీటి ఆధారంగా చూస్తే మీరు ఏం ఆలోచించి ఈ బిల్లు తయారు చేశారు? అని ప్రశ్నించారు.
ఆర్టికల్ 15 సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తుందని, ఇప్పుడు చేస్తున్న సవరణలతో ఆర్థిక వెనుకబాటు అంశాన్ని చేరుస్తున్నారని, కొత్త చట్టం ప్రకారం రూ.4 వేలు సంపాదించే ఎస్సీలు అణగారిన వర్గాలు కారని వ్యాఖ్యానించారు. నెలకు రూ.60 వేలు సంపాదించే వేరే వర్గాల వారిని పేదలుగా గుర్తిస్తున్నారని, ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ, ఈ పది శాతం కోటాలోకి ఎస్పీ, ఎస్టీలు వచ్చే అవకాశం లేదని విమర్శించారు.