Andhra Pradesh: వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్రపై చంద్రబాబు సెటైర్!
- రామాయపట్నం పోర్టును వివాదాస్పదం చేస్తున్నారు
- పేపర్ మిల్లుతో 50 వేల మంది రైతులకు లబ్ధి
- ప్రకాశం జిల్లా జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు
రామాయపట్నం పోర్టును కొందరు రాజకీయ నేతలు అనవసరంగా వివాదాస్పదం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోర్టుతో ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. త్వరలోనే జిల్లాలో అతిపెద్ద పేపర్ మిల్లును తీసుకుని వస్తామనీ, దీనివల్ల 50,000 మంది రైతులు లబ్ధి పొందుతారని వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో ఈరోజు నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.
రామాయపట్నం ఓడరేవు నిర్మాణం పూర్తయ్యేసరికి పేపర్ మిల్లు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు సహకరించడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా జగన్ ప్రజాసంకల్ప యాత్రపై కూడా చంద్రబాబు స్పందించారు. తాను పవిత్ర పాదయాత్ర చేస్తే.. జగన్ విరామ పాదయాత్ర చేశారని ఎద్దేవా చేశారు.
కోడి కత్తి కేసును ఎన్ఐఏకు అప్పగించడం అంటే దొడ్డిదారిన రాష్ట్రంపై కేంద్రం పెత్తనం చేయడమేనని స్పష్టం చేశారు. సీబీఐ డైరెక్టర్ గా అలోక్ వర్మను తిరిగి నియమించాలని సుప్రీంకోర్టు చెప్పడం ప్రధాని నరేంద్ర మోదీకి చెంపదెబ్బని చంద్రబాబు వ్యాఖ్యానించారు.