BRAZIL: మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ ను బెదిరించిన దొంగ.. షేపులు మారిపోయేలా చావగొట్టిన యువతి!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-391b67d83310a8576b07362889b68628a351c9d4.jpg)
- బ్రెజిల్ లోని రియో డిజనీరోలో ఘటన
- బొమ్మ తుపాకీతో బెదిరించిన దొంగ
- పోలీసులకు అప్పగించిన పోల్యానా
ఎదుటివారి బలం, బలహీనత తెలిశాకే ఎప్పుడైనా గొడవ పెట్టుకోవాలని పెద్దవాళ్లు చెబుతారు. అయితే ఓ దొంగ మాత్రం బొమ్మ తుపాకీతో ఓ యువతిని బెదిరించి దోచుకోవాలనుకున్నాడు. మేడమ్.. టైమ్ ఎంత అయింది? అంటూ మర్యాదగా దగ్గరకు వెళ్లాడు. ఆ తర్వాత మొబైల్, పర్సు ఇచ్చేయాలనీ, తన దగ్గర తుపాకీ ఉందని హెచ్చరించాడు. అయితే అక్కడే సదరు దొంగకు ఊహించని షాక్ తగిలింది. సదరు యువతి మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఏ) ఫైటర్ కావడంతో ఆ దొంగ షేపులు మారిపోయాయి. అతడిని చిత్తుచిత్తుగా చావబాదిన ఆమె పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన బ్రెజిల్ లోని రియో డిజనిరోలో చోటుచేసుకుంది.
రియో డిజనీరోలో ఎంఎంఏ ఫైటర్ పోల్యానా వైనా(26) నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఓ చోటకి వెళ్లేందుకు ఉబెర్ కారును బుక్ చేసింది. ఇంతలోనే ఓ యువకుడు అటుగా వెళుతూ ఆమెను టైమ్ ఎంత అయిందని అడిగాడు. దీనికి పోల్యానా మర్యాదగా జవాబు చెప్పింది. అయితే అతను అక్కడే పక్కన నిలబడ్డాడు. అనంతరం మెల్లిగా ‘నీ పర్సు, మొబైల్ తీసి ఇచ్చేయ్. అరవకు. నా దగ్గర తుపాకీ ఉంది’ అని హెచ్చరించాడు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-a4b183e2df8ea874f4fbdc9a5828d1f3f945cbd8.jpg)