rails: భవిష్యత్తు బ్రీజ్ రైళ్లదే... హైడ్రోజన్, ఆక్సిజన్‌లే ఇంధనం!
- అభివృద్ధి చేస్తున్న ప్రెంచ్ కంపెనీ ఆల్‌స్టం
- బ్రిటన్‌లో ప్రక్రియ ప్రారంభం
- 2021 నాటికి వంద ఇంజిన్ల అభివృద్ధి లక్ష్యం
సుదూర ప్రాంతాలకు చౌకగా, సౌకర్యవంతంగా వెళ్లాలంటే రైలు ప్రయాణం ఉత్తమం. కానీ వీటిని నడపాలంటే బోలెడంత డీజిల్ లేదా విద్యుత్ ఖర్చు చేయాలి. డీజిల్ లోకోతో పర్యావరణానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. మరోపక్క, అవసరమైన విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియవల్ల పర్యావరణానికి ఇబ్బందులే. అందుకే భవిష్యత్తు బ్రీజ్ రైళ్లదే అంటున్నారు నిపుణులు.
విశేషం ఏమిటంటే, వీటికి డీజిల్ అక్కర్లేదు, కరెంటు అవసరం ఉండదు. హైడ్రోజన్, ఆక్సిజన్ మిశ్రమమే ఇంధనం. పైగా శబ్దకాలుష్యం కూడా లేకపోవడం అదనపు ప్రయోజనం. విద్యుత్ ఇంజన్ల కోసం ప్రస్తుతం పట్టాల వెంబడి విద్యుద్దీకరణకు చేస్తున్న కోట్ల ఖర్చు కూడా మిగులుతుంది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఈ కొత్త తరహా లోకోమోటివ్‌కు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. ఫ్రెంచ్ కంపెనీ ఆల్‌స్టం ఈ ఇంజన్ ను అభివృద్ధి చేస్తోంది.
అన్నీ అనుకున్నట్లు సాగితే 2021 నాటికి 100 ఇంజన్లు తయారు చేయాన్నది ఈ కంపెనీ లక్ష్యం. ఈ ఇంజన్లకు ప్రధాన ఇంధనం హైడ్రోజన్. ఇందుకోసం భారీ ఇంధన ట్యాంక్‌ను నెలకొల్పి అందులో హైడ్రోజన్ గ్యాస్ రూపంలో నిల్వ చేస్తారు. దీనికి ఆక్సిజన్ మిక్స్ కావడం ద్వారా మోటారు తిరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్‌తో ఇంజన్ నడుస్తుంది. ఇంజన్ వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను ఇంజన్‌లోని ఓ భాగంలో ఏర్పాటు చేసిన లిథియం బ్యాటరీలు నిల్వ చేసుకుంటాయి.
ప్రమాదం జరిగినప్పుడు హైడ్రోజన్ లీక్‌కాకుండా పైపులన్నీ బ్లాక్ అయిపోయేలా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఇంజిన్ నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. ఎటువంటి కాలుష్య ఉద్గారాలను విడుదల చేయదు. ఒక సింగిల్ ట్యాంక్ హైడ్రోజన్ ట్యాంక్‌తో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఏకబిగిన రైలు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించగలదు. కొత్త రైలును తయారు చేయడానికి ఎక్కువ మొత్తం వ్యయం అవుతుండడంతో అల్‌స్టం ప్రతినిధులు ప్రస్తుతం బ్రిటన్‌లో వినియోగంలో ఉన్న విద్యుత్ ఇంజిన్లనే బ్రీజ్ ఇంజన్లుగా మార్పు చేస్తున్నారు. బ్రీజ్ ఇంజన్‌తో రైళ్లు పట్టాలపై పరిగెత్తడం ప్రారంభమైతే పర్యావరణానికి ఉపయుక్తంగంగా ఉండడమేకాక ప్రయాణికులు కూడా హాయిగా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుందని బ్రిటన్ రైల్వే మంత్రి ఆండ్రూ జోన్స్ చెబుతున్నారు.