Andhra Pradesh: జగన్ ఓ అవినీతి చక్రవర్తి.. అవినీతిపరులే ప్రస్తుతం అవినీతిపై పుస్తకాలు వేస్తున్నారు!: వైసీపీకి చంద్రబాబు చురకలు

  • ఆరెస్సెస్ కుట్రను బీజేపీ అమలు చేస్తోంది
  • ఈబీసీ రిజర్వేషన్లను స్వాగతిస్తున్నాం
  • టీడీపీ నేతలతో సీఎం టెలీ కాన్ఫరెన్స్

ప్రముఖ హిందుత్వ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) కుట్రలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. భారత్ ను ఈ కుట్రలకు కేంద్రంగా మార్చారని దుయ్యబట్టారు. కేంద్రం అగ్రవర్ణాల్లోని పేదలకు(ఈబీసీ) 10 శాతం రిజర్వేషన్ల కోసం బిల్లును తీసుకురావడంపై స్పందిస్తూ.. మంచికోసం రిజర్వేషన్ బిల్లు తెస్తే స్వాగతిస్తామని వెల్లడించారు. అయితే ఇందుకోసం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ కు గండి కొడతామంటే మాత్రం ఊరుకోబోనని, ఎదిరిస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

దేశంలో ఇప్పటివరకూ సామాజిక అసమానతలు, వెనుకబాటుతనం తొలగించేందుకే రిజర్వేషన్లు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. అయితే ఇప్పడు ఆర్థిక వెనుకబాటుతనం నిర్మూలనకు కొత్తగా రిజర్వేషన్లు తెచ్చారని వ్యాఖ్యానించారు. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్ ను స్వాగతించాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అవినీతి పరులే ప్రస్తుతం అవినీతిపై పుస్తకాలు వేస్తున్నారని ప్రతిపక్ష వైసీపీకి బాబు చురకలు అంటించారు.

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ఓ అవినీతి చక్రవర్తి అని చంద్రబాబు విమర్శించారు. జగన్ కారణంగా ఎంతోమంది జైలుకు వెళ్లారని దుయ్యబట్టారు. జయప్రకాశ్ కమిటీ ఏపీకి రూ.75,000 కోట్లు రావాలని చెప్పిందనీ, ఈ విషయంలో జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధి విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
BJP
rss
EBC
reservation
  • Loading...

More Telugu News