Andhra Pradesh: అఖిలప్రియ గన్ మెన్లను తిరస్కరించిన విషయం సీఎం దృష్టికి వెళ్లిందన్న హోంమంత్రి చినరాజప్ప!
- నంద్యాలలో అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు
- సమస్య ఉంటే పెద్దల దృష్టికి తేవాలన్న హోంమంత్రి
- ఈ వివాదాన్ని సీఎం పరిష్కరిస్తారని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ ఇటీవల తన గన్ మెన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే. నంద్యాలలోని తన అనుచరుల ఇళ్లలో అర్ధరాత్రి పోలీసుల సోదాలకు నిరసనగా అఖిలప్రియ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు మద్దతుగా సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి సైతం గన్ మెన్లను వెనక్కు పంపారు. తాజాగా ఈ వివాదంపై ఏపీ హోంమంత్రి నిమ్మకాలయ చినరాజప్ప స్పందించారు.
ఏపీ మంత్రి అఖిలప్రియ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని చినరాజప్ప అన్నారు. ఏదైనా సమస్యలు ఎదురైతే వెంటనే పార్టీ, ప్రభుత్వంలో పెద్దల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నంద్యాలలో అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు, అఖిలప్రియ గన్ మెన్లను వెనక్కు పంపిన ఘటన సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లిందని పేర్కొన్నారు. ఈ సమస్యలను చంద్రబాబు పరిష్కరిస్తారని వ్యాఖ్యానించారు. కర్నూలులో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి ఈ మేరకు స్పందించారు.