New Delhi: నా చెల్లిని ఎవరు చంపారు.. దేశ రాజధానిలో ప్లకార్డులు చూపిస్తూ అందరిని అడుగుతున్న అన్న!
- హిట్ అండ్ రన్ ఘటనలో యువతి దుర్మరణం
- దోషులను గుర్తించలేకపోయిన పోలీసులు
- సొంతంగా రంగంలోకి దిగిన సోదరుడు మయాంక్
స్కూటీపై వెళుతున్న చెల్లిని గుర్తుతెలియని కారు ఢీకొట్టి చంపేసింది. ఈ విషయంలో సరైన సాక్ష్యాలు దొరక్కపోవడంతో పోలీసులు సైతం చేతులు ఎత్తేశారు. అయితే ఆమె అన్నయ్య మాత్రం పట్టువీడలేదు. అధికారులు సాయం చేయకపోయినా తన చెల్లిని చంపిన హంతకులను పట్టుకోవడం కోసం ప్లకార్డులు, కర పత్రాలతో పోరాటం మొదలుపెట్టాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఢిల్లీకి చెందిన కనకగోయల్(21) స్థానికంగా ఉండే ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ చేస్తోంది. ఈ క్రమంలో ముకర్బా చౌక్ వద్ద ఈ నెల 2న ఓ కారు ఆమె నడుపుతున్న స్కూటీని బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. రక్తపుమడుగులో పడిపోయి చాలాసేపు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడిన బాధితురాలు చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు సరైన సాక్ష్యాలు లేకపోవడంతో విచారణలో ముందుకు వెళ్లలేకపోయారు. దీంతో సోదరుడు మయాంక్(25) రంగంలోకి దిగాడు.
చెల్లి ఫొటో, ప్రమాదానికి గురైన వాహనం, హెల్మెట్ చిత్రాలతో మయాంక్ కరపత్రాలు, ప్లకార్డులు తయారు చేయించాడు. వీటిని ప్రయాణికులకు పంచుతూ.. తన చెల్లి హంతకుల వివరాలు తెలిస్తే చెప్పాలని ప్రతీ ఒక్కరిని కోరుతున్నాడు. ఈ విషయమై మయాంక్ స్పందిస్తూ.. తన సోదరిని ఎవరో కావాలనే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. తన చెల్లి హంతకులను పట్టుకుని తీరుతానని మయాంక్ స్పష్టం చేశాడు.