Kolkata: మంచం పట్టిన భార్యను బతికించుకునేందుకు 75 ఏళ్ల భర్త తపన.. వయోలిన్ వాయిస్తూ విరాళాల సేకరణ
- గర్భాశయ కేన్సర్ బారిన పడిన భార్య
- బతికించుకునేందుకు దేశవ్యాప్త పర్యటన
- వయోలిన్ వాయిస్తూ విరాళాల సేకరణ
కేన్సర్ బారిన పడిన భార్యను బతికించుకునేందుకు ఓ భర్త పడుతున్న తపన చూసిన వారితో కన్నీళ్లు పెట్టిస్తోంది. 75 ఏళ్ల వయసులో వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా వయోలిన్ వాయిస్తూ దేశవ్యాప్తంగా తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నాడు. కోల్‌కతాకు చెందిన స్వపన్ సేఠ్ భార్య పూర్ణిమ 2002లో గర్భాశయ కేన్సర్ బారిన పడింది.
భార్యను ఎలాగైనా రక్షించుకోవాలని స్వపన్ భావించాడు. అయితే, ఆమెకు ఖరీదైన కేన్సర్ వైద్యం అందించే స్తోమత ఆయనకు లేదు. కానీ, భార్యను రక్షించుకోవాలన్న తపన ఉంది. దీంతో, ఆయనకు తాను వయోలనిస్ట్‌నన్న విషయం గుర్తొచ్చింది. ఆ మరుక్షణం నుంచి వయోలిన్ పట్టుకుని బయటకొచ్చాడు. వయోలిన్ వాయిస్తూ దేశవ్యాప్తంగా తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నాడు. భార్యను బతికించుకోవడానికి ఆయన పడుతున్న తపన గురించి తెలిసి అందరి హృదయాలు ద్రవించిపోతున్నాయి.