Andhra Pradesh: జగన్ దగ్గర డబ్బున్న నాయకులకే చోటు.. నాకు జరిగిన అన్యాయంపై ఏపీ అంతటా పర్యటిస్తా!: వైసీపీ బహిష్కృత నేత పొలిశెట్టి శివకుమార్

  • తెలంగాణలో పార్టీని నిర్వీర్యం చేశారు
  • తొమ్మిదేళ్లుగా అంకితభావంతో పనిచేశాం
  • జగన్ పై నిప్పులు చెరిగిన వైసీపీ మాజీ నేత

వైసీపీ అధినేత జగన్ పార్టీని తెలంగాణలో నిర్వీర్యం చేసి ఏపీలో అధికారం కోసం పాకులాడుతున్నారని ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు పొలిశెట్టి శివకుమార్ విమర్శించారు. తనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 9 సంవత్సరాలుగా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసినవారికి వైసీపీలో ఎలాంటి గౌరవం లేదని శివకుమార్ స్పష్టం చేశారు. తనను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఈరోజు అనుచరులతో కలిసి లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. జగన్ వద్ద డబ్బులు ఉన్న నాయకులకే స్థానం ఉందనీ, ఇలాంటి వ్యక్తులు ప్రజలు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. త్వరలోనే తాను ఏపీలో పర్యటించి పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో ఒక్కో రోజు చొప్పున జగన్ వ్యవహారశైలిపై ప్రచారం చేస్తానని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైపీసీ శ్రేణులు, వైఎస్ అభిమానులు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని పిలుపునివ్వడంతో జగన్ శివకుమార్ ను సస్పెండ్ చేశారు. అయితే కేసీఆర్ వైఎస్ ను తిట్టడంతోనే తాను అలా స్పందించానని శివకుమార్ తన చర్యను సమర్థించుకున్నారు.

Andhra Pradesh
Telangana
YSRCP
Jagan
Telangana Assembly Election
siva kumar
polisetty
  • Loading...

More Telugu News