Sankranti: సంక్రాంతి సినిమా సందడి... ఏ సినిమా ఎన్ని థియేటర్లలోనంటే..!

  • 'ఎన్టీఆర్-కథానాయకుడు'తో సందడి మొదలు
  • ఆపై వరుసగా కొత్త చిత్రాల విడుదల
  • ఉన్న 1600 థియేటర్లను పంచుకోవడంలో గొడవలు
  • 'పేట', 'విశ్వాసం' చిత్రాలకు థియేటర్ల కరవు

సంక్రాంతి సినిమా సందడి రేపు 'ఎన్టీఆర్-కథానాయకుడు'తో మొదలు కానుంది. ఆపై మరుసటి రోజు రజనీకాంత్ నటించిన 'పేట', రామ్ చరణ్ చిత్రం 'వినయ విధేయ రామ'  రానున్నాయి. ఒక్కరోజు తేడాలో మూడు పెద్ద సినిమాలు. వీటికితోడు 12న వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన 'ఎఫ్-2' రానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కొరత ఏర్పడగా, చిత్ర నిర్మాతల మధ్య వాడీవేడిగా మాటల యుద్ధం సాగుతోంది.

వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు దాదాపు 4 వేలకు పైగా సినిమా థియేటర్లుండేవి. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా, అన్నీ విడుదలయ్యేవి. అప్పట్లో సినిమా బాగుంటే శతదినోత్సవాలు ఖాయం కాబట్టి ఎవరికీ నష్టం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. థియేటర్ల నిర్వహణ కష్టం కావడంతో ఎన్నో సినిమా హాల్స్ ఫంక్షన్ హాల్స్ గా మారిపోయాయి. థియేటర్ల సంఖ్య 1600కు పడిపోయింది.

ఇక ఇప్పుడు ఏ సినిమా కూడా 100 రోజులు, 365 రోజులు ఆడే పరిస్థితి లేదు. సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేసుకుని, తొలి వారాంతం వరకూ వచ్చిన కలెక్షన్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. సినిమా బాగుంటే, మరో వారం పది రోజుల పాటు ఆడుతుంది. ఆపై ఉన్న సినిమాను ఎత్తేసి, మరో సినిమాను వేసుకోవాల్సిందే. పెద్ద సినిమాలు విడుదలైన ప్రతిసారీ, చిన్న సినిమాలకు థియేటర్ల కొరత ఏర్పడుతూనే ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఈ సంక్రాంతికి మాత్రం రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ చిత్రానికి కూడా థియేటర్లు కరవయ్యాయి.

ఇటీవలి రజనీ సినిమా '2.0' సుమారు 900 థియేటర్లలో విడుదల కాగా, 'పేట'కు కనీసం 200 థియేటర్లు కూడా లభ్యం కాని పరిస్థితి. 9వ తేదీన విడుదల కానున్న 'ఎన్టీఆర్ - కథానాయకుడు' ఆ ఒక్కరోజూ సుమారు 1200 థియేటర్లలో ఆడనుంది. ఆపై 10వ తేదీ నాటికి థియేటర్ల సంఖ్య 600 నుంచి 700కు తగ్గనుండగా, దాదాపు 800 థియేటర్లలో వినయ విధేయ రామా విడుదల కానుంది. అదే రోజు వస్తున్న 'పేట'తో పాటు మిగతా ఆడుతున్న చిత్రాలన్నీ, మిగిలిన 100 నుంచి 200 థియేటర్లలో సర్దుకోవాల్సిందే.

12వ తేదీన విడుదల కానున్న 'ఎఫ్-2' కనీసం 500 థియేటర్లలో విడుదల కానుండగా, ఆ సమయానికి  'ఎన్టీఆర్ - కథానాయకుడు', 'వినయ విధేయ రామ' చిత్రాలను కొన్ని థియేటర్ల నుంచి తొలగించక తప్పదు. ఇదే సమయంలో అజిత్ నటించిన 'విశ్వాసం' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కనీసం 100 థియేటర్లు కూడా లభించే అవకాశాలు లేవు.

  • Loading...

More Telugu News